Analytics

Vijnaanakhani Cheemakurti

విజ్ఞానఖని చీమకుర్తి
విజ్ఞాన సర్వస్వాలు చూసే అలవాటున్న వారికి ఒక పేరు తరచూ కనిపిస్తుంటుంది. తెలుగుభాష, సంస్కృతి, చరిత్రలకు సంబంధించి మనం ఏంమరచిపోయామో, మనకెంత తెలుసో అన్న ప్రస్తావన వచ్చినప్పుడు సైతం విద్వాంసులు ఆయన పుస్తకం చూడమంటారు. అంతేనా? తెలుగుభాషకి పాళీభాషకి ఏదైనా సంబంధం ఉందా? తెలుగులో పాళీపదసంపద ఎంత? తెలుసుకోవాలన్న ఆయన రచనలు పరిశీలించక తప్పదు. తెలుగు భాషకు, సాహిత్యానికి విశేషమైన సేవచేసిన ఆయనే చీమకుర్తి శేషగిరిరావు. ఇతరులను నొప్పించని ప్రవర్తన, అరుదైన ధైర్యసాహసాలు వ్యక్తంచేసిన గాంధేయవాది చీమకుర్తి. వేదోపనిషత్తులతో పాటు, శాస్త్రపరిజ్ఞానం, చరిత్ర, రాజనీతి, లలితకళలు, భాషా శాస్త్రాలపట్ల అవగాహన అన్నీ ఆయన్ని అసమాన మేధావిగా మార్చాయనడంలో సందేహంలేదు.
చీమకుర్తి ఇంటిపేరు చిల్లర. ఆయన తల్లిదండ్రులు ఆదెమ్మ, ఆదినారాయణలు. 1913 జూన్‌ 14న గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా వెల్లటూరులో జన్మించారు. వీరి ప్రాథమిక విద్య చేబ్రోలు, మాధ్యమిక విద్య తెనాలిలో జరిగింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో బి.ఎ. రెండో సంవత్సరం పూర్తిచేసి మహాత్మాగాంధీజీ పిలుపునందుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో దుమికారు. ఆయనకి పదమూడేళ్ల వయసులో చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ దంపతులు ఆయన్ని దత్తత తీసుకోవడంతో అప్పట్నించీ ఇంటిపేరు మారింది. చీమకుర్తి గ్రామంలో రైతులకు చెందాల్సిన మాన్యం, మాన్యం భూముల్ని భూస్వాములు అనుభవిస్తుండడంతో శేషగిరిరావు ఆ రైతులకు నాయకత్వం వహించారు. అహింసామార్గంలో ఆ భూముల్ని రైతులకు ఇప్పించారు. అది ఆయన సాధించిన తొలి విజయం. అది ఆయనలో ఉత్సాహం నింపింది. అది జరిగింది ముప్పైలలో. ఆయన వయసు పట్టుమని పాతికేళ్లు కూడా లేని తరుణంలో. అప్పట్నించీ ఆయన గాంధీ మార్గంలో పయనించారు. ఖద్దరు ధరించడం, నూలు వడకడం వంటివి నిత్యకృత్యాలయ్యాయి. దాదాపు అదే సమయంలో ఉప్పుసత్యాగ్రహం కూడా రానే వచ్చింది. అప్పట్లో అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆవిష్కరించిన విజయ ధ్వజం ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఆయన ఒంగోలు తాలూకా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి అయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అప్పట్లో కనుపర్తి గ్రామ సమీపంలోని ఉప్పుకొఠారు నుంచి ఉప్పు సంగ్రహించి తెల్లవారి పట్ల తన తిరుగుబాటు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులు వెంటపడడంతో అజ్ఞాత వాసంలోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతివాద భయంకర వెంకటాచారి, అచ్యుత పట్వర్థన్‌, జయప్రకాశ్‌నారాయణ్‌ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. గుంటూరు, బొంబాయి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఒంగోలు చేరుకుని బాంబులు తయారుచేశారు. ఆ విషయం పసిగట్టిన పోలీసులు ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిన చీమకుర్తి గుంటూరు, నెల్లూరు, బాపట్ల మొదలైన ప్రాంతాల్లో చాలాకాలం మారువేషాలతో కాలం గడపవలసి వచ్చింది. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రకాశం ప్రీమియర్‌గా పదవీస్వీకారం చేసిన తర్వాత చీమకుర్తి పైన వున్న వారెంటు రద్దయింది.
చీమకుర్తి సాహిత్య జీవితం ఆయన మద్రాసులో తెలుగు భాషాసమితిలో చేరడంతో మొదలైంది. అక్కడ గిడుగు సీతాపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి వారిని కలిశారు. వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. చిన్న చిన్న రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మద్రాసు నుంచి విడివడిన తర్వాత తెలుగు భాషా సమితి హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రధాన సంగ్రాహకుడిగా ఆయన వివిధ గ్రంథాలు ముద్రించారు. ''హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ఆంధ్రాస్‌'' అనే ఆంగ్ల సంపుటానికి తొలిసారిగా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందిన ఆ గ్రంథం తర్వాత రెండో గ్రంథం ''విజ్ఞాన సర్వస్వం'', తర్వాత విశ్వసాహితి, లలితకళలు, చరిత్ర, రాజనీతి వంటి గ్రంథాలకు సంగ్రాహకుడిగా పనిచేశారు. విజ్ఞాన సర్వస్వంలో ఎన్నో వ్యాసాలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన ''ప్రపంచ రాజసర్వస్వము'' సంపుటానికి కూడా సంపాదకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో 'తెలుగు గోష్ఠి' అనే సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులై ఆ సంస్థ పక్షాన - ''తెలుగు మఱుగులు, ఫర్గాటెన్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ తెలుగు, తెలుగు మఱుగులు రెండో భాగం, తెలుగులో పాళీపదాలు, ఉత్పత్తి పిడుగు మొదలైన గ్రంథాలు ప్రచురించారు. ఒంగోలులో ప్రకాశం విగ్రహం ప్రతిష్ఠించిన సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికకి కూడా ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన పేదవిద్యార్థులకు విరివిగా సాయం చేయడమేకాక తన గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి తన భూమిని ఉచితంగా అందచేయడం విశేషం. ఎనభైలలో ఆయన దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. బుద్ధుడిపై ఆయనకి ప్రత్యేక మమకారం. 1994 ఏప్రిల్‌లో నేపాల్‌ సందర్శించారు. తిరుగు ప్రయాణంలో రుషీకేశ్‌ చేరుకుని ఇంటికొస్తూ 1994 సెప్టెంబరు పదహారో తేదీ భోపాల్‌లో పరమపదించారు. చీమకుర్తి భాషాసేవ నిరుపమానం.

No comments:

Post a Comment