Analytics

Sevatatparudu Kalnal Raaju

 

సేవాతత్పరుడు కల్నల్‌ రాజు
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్‌ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం. ఆయన వట్టి కల్నల్‌ మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులు, కళాశాలలు స్థాపించి తెలుగు వారికి వెలుగునీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన వ్యక్తి. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ నిర్మాణంలో పాల్గొన్న యోధుడిగా, ఆజాద్‌హింద్‌ ఫౌజ్‌ నాయకుడిగా పొందిన అనుభవాన్ని కేంద్రమంత్రిగా చేతల్లో చూపిన కార్యశీలుడు. ప్రకృతి ఆరాధకుడు. ఈ దేశం నాకే మిచ్చిందన్నది కాక ఈ దేశానికి నేనేమిచ్చానని ప్రశ్నించుకొని త్యాగయమ జీవితం గడిపిన కల్నల్‌ డాక్టర్‌ డి.ఎస్‌.రాజు జీవిత పయనం ఎలా సాగిందో చూద్దాం.
1904 ఆగస్టు 28న శృంగవృక్షంలో మాతామహుల ఇంట్లో జన్మించారు సత్యనారాయణరాజు. తల్లిదండ్రులు అచ్చయ్యమ్మ, రామచంద్రరాజులు. స్వగ్రామం పోడూరు. నరసాపురం తాలూకా. అప్పట్లో అది కృష్ణా జిల్లాలో ఉండేది.

1924 తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు మారింది. పెద్ద వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆయర్వేద వైద్యులు. అక్షరాలు దిద్దే వయసులోనే తల్లి కన్నుమూసింది. అమ్మ లేకున్నా పిన్ని, పెద్దమ్మలు ఎంతో ఆప్యాయంగా చూశారు. ప్రాథమిక పాఠశాలలైనా లేని ఊళ్లల్లో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరవాసరంలో మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేశాక నర్సాపురం టైలర్‌ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 

1923లో మద్రాసులో ఇంటర్‌ మొదటి తరగతిలో పాసయ్యారు. రాజు డాక్టరు కావాలని తండ్రి కోర్కె. అదే సంవత్సరం విశాఖలో వైద్య కళాశాల ప్రారంభమైంది. మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా రాజు అందులో చేరారు. 28లో చదువు పూర్తయింది.

పై చదువులు చదవాలన్నది రాజు కోరిక. తండ్రి ఆర్థికస్థితి సహకరిస్తుందో లేదోనన్న అనుమానం. అప్పటికే రాజుకి వివాహం కూడా అవ్వడంవల్ల ఎలా? అన్న ఆలోచనలో పడ్డారు రాజు. ఎట్టకేలకు రాజు లండన్‌ వెళ్లారు. ఎల్‌.ఆర్‌.సి.పి., ఎం.ఆర్‌.సి.ఎస్‌. డిగ్రీలు సాధించారు. అప్పట్లో క్షయ, శ్వాసకోశ వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోయేవారు. అందువల్ల రాజు లండన్‌లో ఉన్నత విద్య పూర్తయినా వియన్నా వెళ్లి అత్యున్నత విద్య సాధించాలనుకొన్నారు. వెళ్లారు. శ్వాసకోశ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి పోడూరు గ్రామం వచ్చారు. ప్రాక్టీసు మొదలు పెట్టారు.

అప్పట్లో జాతీయోద్యమ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండేది. దానికి బాగా ఆకర్షితులయ్యారు రాజు. ఓ పర్యాయం రాజుని ఏలూరులో వైద్య సంఘ సమావేశానికి ఆహ్వానించారు. అందులో రాజు అద్భుతంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఓ ఆంగ్ల మిలటరీ అధికారివిని భారతీయుల్లోనూ ఇంతటి ప్రజ్ఞావంతులుంటారా అని ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుని కలిసి మిలిటరీలో చేరితే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజు అంగీకరించారు.

మిలిటరీలో పోస్టింగ్‌ రానే వచ్చింది. బెంగుళూరు, పూనెలో కొన్నాళ్లు పని చేశాక సౌదీ ఆరేబియాలోని ''ఎమన్‌''కి బదిలీ అయింది. ఏడెన్‌ నగరంలో ఉంటూ అబిసీనియా యుద్ధబాధితులకు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాజుకి సింగపూర్‌కి బదిలీ అయింది. ఆయన సింగపూరులో ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం తూర్పు ఆసియా దేశాలకు పాకింది.

1941లో జపాన్‌, ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధ ప్రకటన చేసింది. ఆ సమయంలోనే కల్నల్‌ రాజు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ పట్ల ఆకర్షితులయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌కి కుడిభుజంగా మారారు. అండమాన్‌ దీవులలోని సెల్యులర్‌ జైలును బ్రిటిషర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో కెప్టెన్‌ రాజు, సుభాష్‌ ఇద్దరూ ఉన్నారు. జాతీయ పతాక వందనం చేసిన వారు కూడా వీరిద్దరే. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో కీలక వ్యక్తిగా పరిణమించారు. కల్నల్‌ రాజు నేతాజీ ఆంతరంగిక వైద్యుడిగా పని చేశారు.

1944 ఫిబ్రవరి నాలుగో తేదీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచీ బర్మాలో ఉన్నంతకాలం కల్నల్‌ రాజు నేతాజీ ఆంతరంగికుడిగానే ఉన్నారు. 

1944 ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మణిపూర్‌లోని మెయిరాంగ్‌ ప్రాంతం చేరుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పారదోలి స్వతంత్ర జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఫౌజ్‌ సైనికులు చాలామంది మరణించారు. బ్రిటన్‌ ఆధిపత్యం మొదలైంది. మంచూరియా మీదుగా రష్యా వెళ్లడానికి ప్రయత్నించిన నేతాజీ కల్నల్‌ రాజు కోసం ప్రత్యేకంగా కారు పంపారు. ఆకారు బాంబు దాడిలో గుల్ల అయింది. కల్నల్‌ రాజు మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. అంతకు ముందు అలా ఎన్నో సార్లు జరిగింది! రాజు ప్రమాదానికి గురైన తరుణంలోనే నేతాజీ సింగపూరు నుంచి బ్యాంకాక్‌ వెళ్లిపోయారు. అందరూ రాజు హతులయ్యారని భావించే తరుణంలో ఆయన బయటికొచ్చారు.

ఆనాటికి పదిహేడువేల మంది సైనికులు మిగిలి ఉన్నారు. క్షమాభిక్ష వేడుకొంటే వారిని విడుదల చేస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షమించమని అడగడానికి వారు అంగీకరించలేదు. అయితే భారత జాతీయ కాంగ్రెస్‌ సైనికుల పక్షాన నిలిచింది. కోర్టు మార్షల్‌ విచారణ జరిపి సైనికుల్ని విడుదల చేసింది. 
కల్నల్‌ రాజు పోడూరు చేరుకొన్నారు. తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. మిలిటరీలో చేరమని వైస్రాయ్‌ ఆయనను ఆహ్వానించారు. బరోడా మహారాజు తన పర్సనల్‌ డాక్టర్‌గా రమ్మన్నారు.

విజయలక్ష్మీ పండిట్‌ రష్యాకు రాయబారిగా వెళ్లినపుడు ఎంబసీలో చేరమని కోరారు. వాటన్నిటినీ తిరస్కరించిన కల్నల్‌ రాజు 1953లో ధవళేశ్వరంలో ఆరు ఎకరాల భూమిని సేకరించి ఆస్పత్రి నిర్మించారు. అప్పట్లోనే ఎక్స్‌రే తీసే యంత్రాలు కూడా తెప్పించారు. అలా ఆయన అధునాతన వసతులు కల్పించారు.
మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒరిస్సా మాజీ గవర్నరు కుమారస్వామి వంటి వారు కల్నల్‌ రాజును రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. 

సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య వంటివారుప్రోత్సహించడంతో చివరికి కల్నల్‌ రాజు రాజకీయాల్లోకి రావడానికి సంసిద్ధమయ్యారు. అప్పటికే ఆయన జాతీయనాయకులు గాంధీజీ మొదలుకొని అందరితో మంచి పరిచయాలుండేవి. 

1957 సార్వత్రిక ఎన్నికల్లో కల్నల్‌ డి.ఎస్‌.రాజు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెహ్రూజీతో పరిచయాలుండడంతో ఆరోగ్య, రక్షణ విషయాల్లో ఆయన కల్నల్‌ సలహాలు తీసుకొనేవారు. 

1963లో జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి భారత ప్రభుత్వపు ప్రతినిధిగా కల్నల్‌ని నెహ్రూజీ పంపడం విశేషం.

1962లో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రెండేళ్లు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో, దేశంలో ఆస్పత్రుల్ని తనిఖీ చేసి సదుపాయాలు కల్పించారు.

కల్నల్‌రాజు ఎప్పుడూ దూరదృష్టితో వ్యవహరించారు. అప్పటి విశాఖ జిల్లా కోరుకొండలో సైనిక్‌స్కూల్‌ నిర్మాణానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది పాఠశాల నిర్మించారు. ఆ పాఠశాల కోసం కల్నల్‌రాజు స్వయంగా నెహ్రూజీని కలిశారు. భూపతిపాలెంలో రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మించారు.

ఆయన జీవనయానంలో మరో విశిష్టత కాకినాడలో రంగరాయ మెడికల్‌ కళాశాల స్థాపన! అలాగే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ని ఒప్పించి నెలకొల్పిన ముళ్లపూడి వెంకట్రామయ్య విద్యా సంస్థ. తోటలు పెంచారు. పేదలకు వైద్య సాయం చేశారు. అందరికీ తలలో నాలుకలా మెలిగారు. 

1973 జూన్‌ 6న కల్నల్‌రాజు పరమపదించారు. ఆయన పలు వ్యవస్థల, సంస్థల నిర్మాత.భవిష్యత్తరాలు ఆయన సేవల్ని గుర్తుంచుకొంటాయి. ఆయనకి నమస్కరిస్తూనే ఉంటాయి.

No comments:

Post a Comment