Analytics

Kavitaa Vaitarani C.V.Krishnarao

కవితా వైతరణి సి.వి.కృష్ణారావు
- చీకోలు సుందరయ్య
''ఈ చిత్రమైన ప్రపంచంలో అనామకుడు చక్రవర్తి కావాలనుకుంటాడు. ఎవడూ చూడకుండా దర్బారు చౌకీదారు రాజుగారి సింహాసనం మీద కూర్చుని మీసాలు మెలేస్తాడు. ఈ మూఢుణ్ణి చీకటితప్ప ఎవరు చక్రవర్తిగా గుర్తించారు? అందుకే అసలు సింహాసనాన్నే విరగదన్నండి. తరతమ భేదాలు తెలియకుండా పోతుంది...'' ఈ మాటలనడానికి ఏ రచయితకైనా ఎంత అవగాహన, ధైర్యం కావాలి? అందరితో ఒకేసారి రోదించు
ఒకే స్వరంతో స్పందించు
ఆశకు ఆహ్వానం పలుకుతూ సామూహిక జీవనంలోనే కష్టమైనా, సుఖమైనా మానవ జీవితాన్ని సఫలీకృతం చేస్తుందనే ప్రాచీనతత్వాన్ని ఎంతో ఆధునికంగా వ్యక్తీకరించిన కవి ఈయన.
ఈ జగత్తు పరిధిలో/ ఈ చరిత్ర నడకలో
అనాది మానవుడు మాత్రమే/ సోదరుని కష్టం దొంగిలించలేదు
అప్పట్నించీ నేటివరకు/ సంఘంలో సహచర్యంగా
బ్రతకుట ఎవ్వరికీ తెలియలేదు...
నిజమేకదా... 'సహనాభవంతు''... వంటివన్నీ మననానికీ, చదవడానికీ తప్ప గమనానికి ఎప్పుడూ ఉపయోగించుకోవడం ఈ జాతి నేర్చుకొన్నదని ప్రశ్నించడం తెలిసిన అభ్యుదయకవి... సి.వి.కృష్ణారావు.


అభ్యుదయ కవిత్వోద్యమంలో జన్మించి, జీవిస్తోన్న కవి ఆయన.
'నెలనెలా వెన్నెల' పేరుతో ప్రతినెలా చివరి ఆదివారం సాహితీమిత్రుల్ని సమావేశపరిచి కవితల్ని, కవితోక్తుల్ని, ఆత్మీయతల్ని మరచిపోకుండా కాపాడుకొంటూ ముందుకు సాగుతున్న సమష్టి కవితా శక్తి సి.వి.కృష్ణారావు. 'తమ్ముడూ' అంటూ కొందర్ని, 'నాన్నా' అంటూ కొందర్ని, 'తమ్మీ' అంటూ కొందర్ని, 'అమ్మా' అంటూ మరికొందర్ని తన కరచాలనంతో సాదరంగా ఆహ్వానించి, భుజం తట్టి కవిత్వం నవనవోన్మేషంగా విలసిల్లడానికి తన సర్వశక్తుల్ని ఒడ్డుతున్న కవి, కార్యకర్త, సమాజసేవకుడు, నెలనెలా వెన్నెల సి.వి.కృష్ణారావు.
సుప్రసిద్ధ విమర్శకులు, రచయిత, సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్‌ ఓ చోట కృష్ణారావు గురించి రాస్తూ- ''కృష్ణారావు కవిత సార్వకాలికం. కుందుర్తి విడిచి వెళ్లిన అసలు సిసలు వచనకవితకు కృష్ణారావే చిరునామా అన్నా, అత్యుక్తి కాబోదు! కుందుర్తి ఒక మంచి ప్రయోగం గురించి ముచ్చటిస్తూ ఒకే కేంద్ర కథావస్తువుకు సంబంధించిన భావపరంపర- పరస్పరం పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో ఉందన్నాడు. కృష్ణారావు 'వైతరిణి'లో తరతరాలుగా దగాపడిన అధో జగత్సహోదరుల దుర్భర జీవితాలకు కవితా రూపమిచ్చారు. చీకుచింతలతో కూడిన మురికి పేటలలోని వేలకొలది జనుల విషాదగాధను వినిపించాడు. ఇది ఏకాంతంగా, తీరుబడిగా లోతులు చూడడానికి ఉద్దేశించిన కవితావైతరణి కాదు... ''విధి తిరస్కరించిన వ్యథాభరిత జీవితాలవైపు పాఠకుల దృష్టిని మళ్లించిన వైతరణి! కృష్ణారావు ఆశలు, ఆకాంక్షలూ వైయక్తికాలు కావు, సామాజికం. కష్టజీవుల్ని కడతేర్చి దరిచేర్చగల ఆగామికి స్వాగతం చెప్పే కవి మనస్సు చిరంజీవం. వృత్తులను ప్రతీకలుగా చెప్పి ఈ అట్టడుగు జనాలు ఎవరో పాఠకుల మనస్సులను కదిలించాడే కవి!'' కృష్ణారావుకవిత్వ జీవితాన్ని కవిత్వ తత్వాన్ని ఆయన ఆవిష్కరించారనడంలో సందేహం లేదు.
సి.వి.కృష్ణారావు 1926 జులై మూడో తేదీ నల్గొండ జిల్లా రేవూరులో జన్మించారు. తల్లిదండ్రులు:
జగ్గయ్యపేట, గుంటూరు, హైదరాబాద్‌, బొంబాయిల్లో విద్యనభ్యసించిన సి.వి.కృష్ణారావు బి.కామ్‌డిగ్రీతోపాటు ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా పూర్తిచేశారు. కొన్నాళ్లు బ్యాంకు గుమాస్తాగా పనిచేసి ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల్ని చైతన్యపరిచారు. తర్వాత సాంఘిక సంక్షేమశాఖలో వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం సంచాలకులుగా కొన్నేళ్లు పనిచేసి, అందులోనే పదవీ విరమణ చేశారు. ఆదిలాబాదు నుంచి సాలూరు దాకా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోను దళితులు, ఆదివాసుల్లో విద్య, వ్యవసాయాభివృద్ధి, పశుగణాభివృద్ధి, కుల భేద నిర్మూలన కోసం ఎంతో శ్రమించారు. అందుకే ఆయన పదవీవిరమణ చేసినపుడు వందలాది దళితులు అంతమంచి అధికారి తమని వదలి వెళ్తున్నందుకు బాధనాపుకోలేకపోయారు. టెన్నిస్‌ వాలీ బృహత్తర ప్రణాళికా అధ్యక్షుడు, డెమొక్రసీ ఇన్‌ యాక్షన్‌ గ్రంథరచయిత డేవిడ్‌ లిలియాంతాల్‌ని ఆదర్శంగా తీసుకొని వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. లాండ్‌ కాలనైజేషన్‌ పథకాలు, సాగునీటి పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు చేపట్టే పునరావాస కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు సి.వి.కృష్ణారావు. ఆయన తొలి కవితా సంకలనం ''వైతరణి''. తర్వాత ''మాదీ మీ వూరే'', ''అవిశ్రాంతం'' వచ్చాయి. లాటూరు కిల్లారి భూకంపానికి స్పందిస్తూ ''కిల్లారి'' అనే కవితల సంపుటి ప్రచురించారు. దీన్ని ఢిల్లీకి చెందిన డా. వి.వి.బి.రామారావు ఆంగ్లంలోకి అనువదించారు.

సి.వి.కృష్ణారావు దళిత నిబద్ధత కల దార్శనికుడని ఆయన్ని అత్యంత సమీపంనుంచి గమనించిన సుమనశ్రీ వంటి కవులు, విమర్శకులు పేర్కొనడం గమనార్హం. ఎ.బి.కె.ప్రసాద్‌ అన్నట్లు ''జాషువా 'నాల్గుపడగల హైందవ నాగరాజును' చూపగా, వైతరణి కవి 'పంచముడి ఉనికికి సరికొత్త అర్థాన్ని సంతరించి పెట్టారు. జంటనగరాల్లో కుందుర్తి తర్వాత మరో కుందుర్తిలా వచనకవితా వికాసానికి కృషిచేశారు. ఉబుసుపోకకు కవితలు రాయడం, రాయించడం కాక ప్రతినెలా ఏదో ఒక ప్రసంగమో, చర్చో, పుస్తకావిష్కరణమో జరుపుతూ, యువ కలాల పదును ఏమేరకో కవితాగానాలు నిర్వహించారు. కవితా సంకలనాలు ప్రచురించారు. ఒక కవిత మంచి కవిత ఎందుకైందో విశ్లేషకుల చేత వివరింపజేయడం గమనార్హం. నెలనెలా వెన్నెలను సుమనశ్రీ వంటివారు అవార్డు ప్రదానాలకు వేదిక చేసి యువకవుల్ని ఆకర్షించారు. వయసు భారం ఎంత మీదపడినా, మసాబ్‌ట్యాంక్‌ నుంచి ఆస్మాన్‌గఢ్‌కు మకాం మారినా కార్యక్రమాలకు, కవితాగానాలకు లోటు లేకుండా, లోపం రానీకుండా చేస్తూ సి.వి.కృష్ణారావు నెలనెలా వెన్నెల ఆగకుండా చేస్తున్నారు. సి.వి.కృష్ణారావు నిస్సందేహంగా దళిత నిబద్ధతగల దార్శకుడు! ఒక వైతరణి!!

No comments:

Post a Comment