Analytics

Bhoomiputrinunchi Hrudayanetri Varaku Malathi Chandoor

భూమిపుత్రినుంచి హృదయనేత్రి వరకు... మాలతీ చందూర్‌
-చీకోలు సుందరయ్య
''మల్లాది రామకృష్ణశాస్త్రి గారు'' మాది కృష్ణాజిల్లా పెద్దపీట వెయ్యండి'' అని 'కృష్ణాతీరం'లో ఒకచోట అంటారు. మాది కూడా కృష్ణాజిల్లాయే. కృష్ణా జిల్లాలోని నూజివీడు. ఏలూరికీ, బెజవాడకీ మధ్య వున్న మా వూరికి- రైల్వే స్టేషన్‌ వున్నా, అది వూరుకి పదమూడు మైళ్ల దూరంలో వుంది. మాకు నూజివీడు స్టేషన్‌ కంటే-అరటిపళ్ళ గెలతోక ముందు వుంచుకుని నిల్చుని వున్న హనుమాన్‌ జంక్షన్‌తోనే ఎక్కువ పరిచయం. మా వూరు వెళ్ళాలంటే హనుమాన్‌ జంక్షన్‌ మీదుగానే వెళ్ళాలి. అప్పట్లో ఆగిరిపల్లి రోడ్డులేదు. మా నాన్నగారు జమీందార్ల దగ్గర పనిచేసేవారట. అదేదో కోటపాడో, వుయ్యూరో... నాకు సరిగ్గా తెలియదు. ఎస్టేటులో పనిచేసేవారుట వాళ్ళతో పాటు...!''
ఈ పంక్తులు ఎవరివో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది! యాభయ్యేళ్లుగా తెలుగు పాఠకులకు బాగా తెలిసిన శైలి అది! నిజమే... ఒక భూమి పుత్రి... ఒక హృదయనేత్రి... వెరసి అశేష పాఠకుల అభిమాన రచయిత్రి... మాలతీచందూర్‌!
మద్రాసు వెళ్లే తెలుగు పాఠకులు సందర్శించాలనుకొనే ఇళ్లల్లో వారిదొకటి. చాలా మందికి తెలియనిది ఆ నది నూజివీడులో పుట్టి మద్రాసు దిశగా ప్రవహించిందనీ! ''చందూర్‌గారూ, నేనూ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, బంధువుల్లో కొందరు వ్యతిరేకత, మరికొందరు ఉదాసీనత చూపించారు. అప్పుడు మా అమ్మ ''నేను వున్నాను భయంలేదు'' అని ధైర్యం చెప్పి, ఆసరాగా నిలబడింది. తనని నిందించినా, నిశ్శబ్దంగా సహించింది. ఆనాడు అన్నవారే ఈనాడు చుట్టరికాలు తిరగేస్తున్నారు...'' ఇప్పుడు అర్థమై ఉంటుంది... ఆ నది మద్రాసువైపునకు ఎందుకు ప్రవహించిందో!! సుశీల పాట వింటే భానుమతిని తెరమీద చూస్తే... మన సొంత అక్కయ్యలా ఎలా ఫీలవుతామో... మాలతీచందూర్‌ పేరువిన్నా అలాగే ఫీలవుతాం.
హైదరాబాదు హోటల్‌ గదిలో మాలతీ చందూర్‌ చేతి బంగారు గాజులు పోగొట్టుకొన్నారని పత్రికల్లో చదివిన వారు చాలామంది తమ ఇంట్లో దొంగలు పడ్డారన్నంతగా బాధపడ్డారు! ఆమె హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందితే రచయితలు, రచయిత్రులు తామే పొందినంత సంతోషించారు! ఆమెని ప్రత్యక్షంగా అభిమానించేవారు ఆమెకు ఉత్తరాల ద్వారానో, సభలు, సమావేశాల్లో కలవడం ద్వారానో పరిచయమయ్యే ఉంటారు. పరోక్షంగా అభిమానించేవారు వేలాది మంది!
1930లో జన్మించిన మాలతి, ఆరుగురు సంతానంలో చిట్టచివరి సంతానంగా పెరిగారు. ఆమె పదోనెల్లోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆమె తల్లి పుట్టింటికి పోకుండానే సంసారాన్ని లాక్కొచ్చారు. ''మీకు తండ్రి లేడు. తండ్రిలేని పిల్లలు అని నలుగురూ, జాలిపడి చులకన చేసే విధంగా వుండకూడదు'' అంటూ ఆమె తల్లి ఆ పిల్లలకు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం నూరిపోశారు. మాలతికి ''అమ్మ డిక్షనరీలో మాతృప్రేమకు పర్యాయపదం క్రమశిక్షణ''గానే అర్థమైంది. పరిస్థితుల ప్రభావం అటువంటిది. అందుకే కళాశాల మెట్లెక్కకుండా నూజివీడు, ఏలూరుల్లోని ఉన్నత పాఠశాల విద్యతో సరిపెట్టుకొన్నారు మాలతి. ''నేను కాలేజీలో చేరి ఏ బి.ఏనో చదివి వున్నట్లయితే టీచర్‌గానో, గుమాస్తాగానో బతికేదాన్ని. కాలేజీ చదువు దక్కలేదు గాబట్టే రచయిత్రినయ్యాను'' అనే మాలతి జీవితంలో ముఖ్యమైన మలుపు చందూర్‌ ప్రవేశంతో చోటు చేసుకొంది. ''చందూర్‌గారితో వివాహం జరిగి మద్రాసు (ఇప్పటి చెన్నై)లో స్థిరపడ్డాక మూడేళ్లపాటు ఎక్కడికీ వెళ్లకుండా సాహిత్యపఠనం చేశాను. మద్రాసు లిటరరీ సొసైటీయే నా యూనివర్సిటీ. అప్పుడే విశ్వసాహిత్యంతో పరిచయం కలిగింది. నా ఆలోచనలకు, భావాలకు పునాది పడింది. ఆ సమయంలోనే రేడియో ప్రసంగాలు చేసే అవకాశాలూ వచ్చాయి. క్రమంగా నేనెందుకు కథలు రాయకూడదన్న ఆలోచనా, పట్టుదలా కలిగాయి. ఆ విధంగా రూపుదిద్దుకున్నదే నా మొదటి కథ'' ఆ కథే 1950 ప్రాంతాల్లో ''ఆనందవాణి'' పత్రికలో అచ్చయిన ''రవ్వల దుద్దులు''. పధ్నాలుగేళ్ల వయసులో చలం, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటివారిని కలిసే అవకాశం వచ్చింది. ఆమె తెలుగు కవులు, కథకులు, రచయిత్రులతోపాటు ఆంగ్ల రచయితల్ని విస్తృతంగా చదివారు. టాల్‌స్టాయ్‌, జేన్‌ ఆస్టిన్‌, ఛార్లెస్‌ డికెన్స్‌, సోమర్‌సెట్‌ మామ్‌, పెరల్‌ ఎస్‌.బక్‌, టాగూర్‌... ఇలా తాను చదువుతోన్న ప్రతి రచయితలోనూ ఏదో ఓ ప్రత్యేకతని గుర్తించారు. దాన్ని అవగతం చేసుకొన్నారు. చిన్ననాడు తను చూసిన జీవితం తర్వాత తను అనుభవించినదీ ఆమెకు చక్కని పునాదులు వేస్తే, ఆ పునాదుల మీద తను అర్థం చేసుకొన్న జీవితాల్లోంచి పాత్రలు తీసుకొని వాటికి సాహిత్య గౌరవం కల్పించారు. అలా వచ్చినవే-ఎనిమిది కథా సంకలనాలు; చంపకం-చెదపురుగులు, కాంచన మృగం, వైశాఖి, మనసులోని మనసు, ఎన్నిమెట్లెక్కినా, సద్యోగం, భూమిపుత్రి, మధురస్మృతులు, ఆలోచించు, ఏమిటీ జీవితాలు, జయలక్ష్మి, కృష్ణవేణి, మేఘాల మేలి ముసుగు, కలలవెలుగు, బతకనేర్చిన జాణ, రాగరక్తిమ, హృదయనేత్రి, శిశిర వసంతం, శతాబ్ది సూరీడు వంటి ముప్పై నవలలు! స్త్రీలు, గృహజీవనం తదితరాలకు సంబంధించి వంటలు-పిండివంటలు, అందాలు - అలంకారాలు, ప్రశ్నలు-జవాబులు, జాబులు-జవాబులు, మహిళలకు మధురజీవనం మొదలైన మరో పదిహేను పుస్తకాలు! ఇవికాక ఎన్నో సాహితీ వ్యాసాలు, సాహిత్యేతర వ్యాసాలు! తమిళంలో ప్రసిద్ధ రచయితలు జయకాంతన్‌, కరుణానిధి, శివశంకరి, పార్థసారథి, పుదుమై పిత్తన్‌, సుజాత వంటి వారి రచనలను తెలుగులోకి అనువదించారు మాలతీచందూర్‌. ముప్పై ఏళ్లుగా ''పాతకెరటాలు'' పేరుతో ఆంగ్ల రచనల పరిచయం చేస్తున్నారు. 47 సంవత్సరాలుగా భారతీయ పత్రికారంగంలోనే రికార్డుగా నిలిచిపోయేది ఆమె విశిష్ట శీర్షికారచన! అది నిలిచిపోయేంత వరకు ఆంధ్రప్రభ వారపత్రిలో, ఆ తర్వాత 'స్వాతి' వారపత్రిలోనూ వస్తోన్న సంగతి పాఠకులకు తెలిసిందే.
పన్నెండు సంవత్సరాల పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌లో సభ్యురాలుగా ఉన్న మాలతీ చందూర్‌, ఎంతోకాలంగా దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ (మద్రాసులో) స్థాపించిన ఆంధ్రమహిళా సభలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు. వినియోగదారుల ఫోరమ్‌ మేనేజింగ్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. నిర్వాసిత మహిళలకు ఆశ్రయం కల్పించే ''ఆశ్రయ'' సంస్థ సలహా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్రమహిళా సభ ఆధ్వర్యంలో వర్కింగ్‌ గరల్స్‌ హాస్టల్‌కి ఛైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, మద్రాసులోనూ ఉన్న ప్రసిద్ధ అవార్డులన్నీ ఆమె పొందారు. 1987లో 'భూమిపుత్రి'కి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 'హృదయనేత్రి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కైవసం చేసుకొన్నారు. ఈ నవలకే కర్ణాటక నుంచి ''అతే మబ్బె'' అవార్డును, కోల్‌కతానుంచి 'భారతీయ భాషా పరిషత్‌' అవార్డును పొందారు! పద్మావతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందిన మాలతీచందూర్‌ ఈ నాటి కథకులు, కథల గురించి-''ఇప్పుడొస్తోన్న తెలుగు కథల్లో అద్భుతమైన వైవిధ్యం కనిపిస్తోంది. కుటుంబ బంధాలనుంచి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాకా ప్రతీ విషయం కథావస్తువుగా ఒదిగిపోతోంది. రాజకీయం, ప్రాంతీయత, కులం, పారిశ్రామిక రంగం, మహిళల, దళితుల, అంతర్జాతీయ సమస్యల్లో ఏవీ రచయితల దృష్టిని దాటిపోవడం లేదు. ముఖ్యంగా ఈతరం కథకుల్లో కనిపిస్తున్న ఎవేర్‌నెస్‌, అభివ్యక్తిలో నిజాయితీ చూస్తే సంతోషంగా వుంది...'' ఈ అభిప్రాయంలో ఆమె హృదయం ఎంత విశాలమో తెలుపుతోంది. అంతేకాదు, తమ రచనలకో, తమ కాలం రచనల వద్దో ఆగిపోయే సీనియర్లకన్నా భిన్నంగా ఆలోచించే ఆమె మనస్తత్వం కూడా దీనిద్వారా తెలుస్తోంది. ''నేను సమాజాన్ని మార్చాలనీ, మార్చగలననీ అనుకొని రచనలు చేయలేదు'' అని ఆమె అనడం ఆమె ఔన్నత్యానికి, ఎంత ఎదిగినా ఒదిగి నిలిచే గుణానికీ నిదర్శనం. ఎంతోమంది ఆమె రచనలనుంచి స్ఫూర్తినీ, పరిష్కారాలను పొందారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిబద్ధత, నిర్భయత్వం, సమాజంపట్ల ప్రేమ, జీవితం పట్ల ఆశావహ దృక్పథం... ఇవన్నీ కలిస్తేనే ఒక మాలతీ చందూర్‌...! ...ఆమె రచనలు!!

No comments:

Post a Comment