Analytics

Aadhunikullo Samkuchita Paridhi kanipistondi

''ఆధునికుల్లో సంకుచిత పరిధి కనిపిస్తోంది''
:ఏల్చూరి మురళీధరరావు
స్తినాపురంలో తెలుగు పలుకును కమ్మగానే కాదు, మనోజ్ఞంగా, సరళ సుందరంగా, భావ గర్భితంగా వినిపించగల ''సుమధుర వాణి'' ఆయనది. పద్యమైనా, సంస్కృత శ్లోకమైనా విన సొంపుగా పఠిస్తూ, శ్రోతలకు కలిగే అనుమానాల్ని తీరుస్తూ తెలుగు భారతిగా మన్ననలందుకొన్న రచయిత, వక్త, ఉపన్యాసకులు, అనువాదకులు, అవధాని, పండిత శిరోమణి డా. ఏల్చూరి మురళీధరరావు. 1954 అక్టోబరు 19న హైదరాబాదులో జన్మించారు. నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం ఆయన జనకులు. పాఠశాల విద్య ఢిల్లీ ఆంధ్ర స్కూల్లో కొన్నేళ్ళు మద్రాసు రామకృష్ణా మిషన్‌ పాఠశాలలో కొన్నేళ్ళు సాగింది. ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పారు ఏల్చూరి-
''మంగళరూప! నీ గుడి సమంచిత భక్తిని జేరి చెప్పులం
బ్రాంగణమందు వీడుట యపాయమటంచు దలంచువారలా
అంటూ రాసిన పద్యం పలువురి మన్ననలందుకొంది. అంతేనా?!
 
1971 నాటికే వేదం వారి మనవడు వేదం వేంకటరాయశాస్త్రి, అనిసెట్టి తదితరుల పరీక్షకు నిలిచి ''బాలకవి'' బిరుదు పొందారు. విద్యార్థి దశలోనే ప్రాచీన సాహిత్యాన్ని మధించి పలువురు స్వామీజీలపై వెలువడిన గ్రంథాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. పుష్కిన్‌, చెకోవ్‌ల వంటి అంతర్జాతీయ రచయితల రచనలకు అనువాదాలు చేశారు. పలు భాషలు నేర్చుకున్నారు. సంస్కృతం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, ప్రాకృతం, రష్యన్‌, ఇటాలియన్‌ భాషల్లో సృజనాత్మక రచనలు చేసే నేర్పు సాధించారు.

1982 నుంచీ వీలు కలిగినపుడల్లా అవధానాలు చేస్తున్నారు. ఇతరుల అవధానాలకు పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆరార్‌ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కళాశాలల్లో ఎం.ఎ. తెలుగు పూర్తి చేశారు. ఎం.ఫిల్‌ మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్రోణపర్వం మీద పూర్తి చేశా. ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్ళు చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలల్లో ఉద్యోగంలో చేరారు.

గణపవరపు ''వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసం'' లోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి ''తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం'' అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో ఉన్న నాలుగేళ్లలో ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లిక్‌, వింజమూరి లక్ష్మి వంటి వారి కోసం లలిత గీతాలు రాశారు. ఢిల్లీ వెళ్లాక నిత్యం సభలు సమావేశాలతో బిజీగా ఉన్నా ''విష్ణు పురాణం'' మొత్తాన్ని సరళాంధ్ర వచనంలో రాశారు. సంస్కృత శ్రీమద్భాగవతాన్ని మూడు సంపుటాలుగా తెలుగులో రాశారు. ఇవన్నీ శ్రీరామకృష్ణ మఠం వారి కోసం నిర్వహించడం గమనార్హం. 'శ్రీశేషశైలేశలీల' అనే బంధ కవిత్వం రాశారు. చిత్ర కవిత్వ లక్ష సారం రాశా. నెల్లూరు, మద్రాసు- ఇలా ఎన్నోచోట్ల సత్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అలహాబాదులో నిర్వహించిన పదిహేను రోజుల సదస్సులో పాల్గొని తెలుగు సాహిత్యాన్ని ప్రచారం చేశారు. కొన్నేళ్లు 'కళాజ్యోతి' అనే పత్రిక నడిపారు.

'భక్తిమార్గం' వంటి నేషనల్‌ ఫిలిం డివిజన్‌ కార్యక్రమాలకు మాటలు, పాటలు రాశారు. సి.వి. సుబ్బారావు ఆంగ్ల కవితల గ్రంథానికి సంపాదకుడిగా ఉన్నారు. ఎన్నో రంగాల్లో ప్రజ్ఞావంతుడైన ఏల్లూరి ఢిల్లీలో తెలుగు బోధన, చదువు, తదితరాల గురించి ఆయన మాటల్లోనే విందాం.

 
* శ్రీశ్రీగారొకసారి నీకు తెలుగు బాగా రావాలంటే ఇంగ్లీషు బాగా చదవమని సలహా ఇచ్చారు. నేను హాస్యానికేమో అనుకొన్నాను. కానీ అధ్యయనం చేశాక నిజమనిపించింది. ఇంగ్లీషు భాష చదివేకొద్దీ అంత నవ్యమైన, విస్తృతమైన భావాలను తెలుగులో ఎలా వ్యక్తీకరించాలో ఆలోచన మొదలైంది.
 
* మన తెలుగు ఎం.ఎ.లో స్లెవొనిక్‌ భాషల్లో ఉన్నంత విస్తృత పరిధిలో అధ్యయనం సాగడం లేదు. మన చదువు కూపస్థ మండూకంలానే ఉంది. కనీసం ఉత్తర భారత దేశంలో సంస్కృతాధ్యయనంలో జరుగుతున్న అధ్యయనం, పరిశోధన కూడా తెలుగులో జరగడం లేదు. తెలుగులో మౌలిక పరిశోధనలు రావడం లేదు. సమకాలీనత, అనువర్తనీయత (అప్లెయిడ్‌ లిటోరీక్రిటిసిజమ్‌) అన్నవి లేనే లేవు. 1950ల తర్వాత విశ్వజనీనమైన దృక్పథాన్ని కోల్పోయాం. ఇపుడు సంస్కృతమైనా, తెలుగైనా ఒక భాషగా మాత్రమే చూస్తున్నాం. ఒక మాధ్యమంగా చూడడం లేదు. ఎం.ఎ. తెలుగు చదివే విద్యార్థులకు దాని ద్వారా ప్రపంచాన్ని దర్శించే కౌశలం అలవడాలి. పరీక్షల దృష్టితో భాషాధ్యయనాన్ని ఒక ఉపకరణంగా మార్చేశారు తప్ప సాహిత్యాధ్యయనం ద్వారా ఆదర్శాల కల్పన, విశ్వమానవుడిని రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. ఒక సంకుచిత పరిధి ఉంది.
 
* ఈ చదువుల వల్ల విద్వాంసులు రావడం లేదు. స్పెషలిస్టులొస్తున్నారు. ప్రాచీనతకు, ఆధునికతకు ఉన్న లంకెను ఇప్పుడు తొలగించారు. వేదం వెంకటరాయశాస్త్రి తెలుగు ఆధునికత పేరుతో తన కాలంలో జరిగిన మార్పుల్ని గుర్తించి ''భాషకు మీరు విషం పెట్టినారు' అని ఆనాడే అన్నారు. అది నిజం అని ఈనాడు రుజువవుతోంది. ఆయన అనువాదాలు ఎలా చేయాలో, నాటక వ్యాఖ్యానాలు ఎలా చేయాలో నేర్పారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు చేసిన ''ప్రసన్న రాఘవ ఆంధ్రీకరణ''ని విమర్శిస్తూ అది సహస్రాధిక దోషజుష్టము అన్నారు. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి గారు శృంగార నైషధ సంజీవనీ వ్యాఖ్య వెలువడినపుడు ''భాషా సాహిత్యాల్లో గొప్ప కృషి చేసిన చివరి పండితుడు వేదం'' అన్నారు.
 
* ఆధునికుల్లో శ్రీశ్రీ, శిష్‌ట్లా, ఆరుద్ర, బైంగి, ఏల్చూరి, దేవులపల్లి వంటి వారి వరకు కూడా కళా విమర్శ పరిచయం ఉండేది. అందువల్లే వారు తెలుగులో కొత్త మార్గాలు సృష్టించారు. ప్రపంచ సాహితీ మార్గాల్ని తెలుగులోకి తెచ్చారు. ఇప్పటివారికి ఆధునిక సాహిత్యంలో సంకుచిత పరిధి కనిపిస్తోంది. కళావిమర్శ లేదు. ప్రపంచ దృక్పథం లేదు. ఇంగ్లీషులో వచ్చిందే ప్రామాణికమని భావిస్తున్నారు. దాన్నే అంధానుకరణం చేస్తున్నారు. బ్రాడ్‌గేజ్‌ రైలు పట్టాలమీద మీటర్‌ గేజ్‌, పెట్టెనెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
 
* సాహిత్యం రాజకీయాలు ఎప్పుడూ అనూచానంగా కలిసే ఉండేవి. ఆధునికుల్లో కేవల రాజకీయాలు రాజకీయ ప్రయోజనంతో సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
 
* ఫ్రెంచి ఫెమినిజమ్‌లో ప్రస్తుతం నాలుగు దశలున్నాయి. అది మూడో దశలో ఉండగా మన తెలుగులో స్త్రీ వాదులు రంగ ప్రవేశం చేశారు. అందువల్ల స్త్రీవాద చరిత్రను ఉపేక్షించి స్త్రీవాదాన్ని మాత్రమే ప్రచారం చేశారు. ఒక్క ఓల్గా మాత్రమే చారిత్రక సమన్వయంతో రాస్తూ వచ్చారు. తక్కినవాళ్లకి అంత విస్తృత అధ్యయనం లేకపోవడం వల్ల స్త్రీవాద రచనలు చేశారు కానీ స్త్రీవాద సిద్ధాంత కర్తలు కాలేకపోయారు.
 
* ఒక యుగాన్ని క్షీణయుగం అనే భావన మన సాహితీ వేత్తలకు లేదు. నిరంతర గతి శీలమైన సాహిత్యంలో క్షీణయుగమనే భావనకు అవకాశమే ఉండదు. కందుకూరి వీరేశలింగం విక్టోరియన్‌ యుగం ప్రభావంతో సాహిత్యంలో శృంగారం అనేది అశ్లీలమనీ, రాచరిక వ్యవస్థకు ఉపకరణంగా పనికొచ్చిన స్వార్థపరుల వ్యాసంగమనీ అపార్థాల్ని ప్రవేశపెట్టారు. కందుకూరి ప్రభావంవల్లే అంధయుగం అన్న ఆలోచన మన సాహితీవేత్తలకు కలిగింది.
 
* ఢిల్లీలో ఏ కళాశాలలో చదివే వారైనా తెలుగు సబ్జెక్ట్‌ తీసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర కళాశాలలో తెలుగు చదివే అవకాశముంది. బి.ఎ., బి.కామ్‌. విద్యార్థులకు మూడు సంవత్సరాలు, బి-ఎస్సీ విద్యార్థులకు రెండు సంవత్సరాలు తెలుగు సబ్జెక్టు ఉంటుంది. ఢిల్లీలో తెలుగు ఒకే ఒక కళాశాలలో చదివే వీలుంది. పాతిక మంది విద్యార్థులున్నారు. తమిళం చదివేందుకు రెండు కళాశాలలున్నాయి. శ్రీ వెంకటేశ్వరతో పాటు మిరండా హవుస్‌ కళాశాల, తమిళానికి ముప్పై నుంచి ముప్పై అయిదు మంది విద్యార్థులున్నారు. మరే దక్షిణాది భాష చదివేందుకు అక్కడ వీల్లేదు. అయితే పి.జి.లో తెలుగు ఎం.ఎ. లేదు.. కానీ ఎం.ఫిల్‌., పి.హెచ్‌.డి వంటివి తెలుగులో చెయ్యవచ్చు. తమిళంలో ఎం.ఎ. చెయ్యవచ్చు. ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి. చెయ్యవచ్చు.
 
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పి.జి.లో తెలుగు బోధన కోసం కృషి చేస్తే ఆ అవకాశం కూడా ఢిల్లీ ఆంధ్రులకు కలగవచ్చు. ప్రభుత్వం సంకల్పిస్తే అదేమంత కష్టం కాదు. అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో రవీంద్రనాథ్‌ టాగూర్‌ (బెంగాలీ), సుబ్రహ్మణ భారతి (తమిళం) పేరిట పీఠాలున్నాయి. అమెరికాలో ఇప్పుడు ఇతర భాషలవారికన్నా ఎక్కువ మంది తెలుగువారున్నారు. విశ్వనాథ వంటి మహా కవుల పేరుతో పీఠాల స్థాపన కోసం కృషి చేయవచ్చు.
 

No comments:

Post a Comment