Analytics

Aadhunika Taatvikudu B.S.Raamulu

ఆధునిక తాత్వికుడు బి.ఎస్‌.రాములు
వ్యక్తికి సమాజానికి సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుంది. వ్యక్తి సమాజంలో భాగంగా జీవిస్తాడు. సమాజంలో భాగంగా రూపుదిద్దుకుంటాడు. సమాజం పరిణామ శీలమైనది. సమాజ క్రమాన్ని వ్యక్తులు, శక్తులు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు సామాజిక వైరుధ్యాలు, సామాజిక వైవిధ్యాలు, పరస్పర ఐక్యత, ఘర్షణ, సహజీవనం, పరిమాణాత్మక గుణాత్మక మార్పుల క్రమాలు నిర్దేశిస్తాయి... ఈ దృష్టితో చరిత్రను అధ్యయనం చేయడాన్ని చారిత్రక భౌతికవాదం అంటారని పుస్తకాల్లో చదువుతుంటాం. అయితే ఆ విధమైన అధ్యయనం చేసిన సామాజిక తత్వవేత్త బి.ఎస్‌.రాములు. ఆధునిక సమాజంలో సాహిత్యాన్ని, సమాజాన్ని రెంటినీ అంతే సీరియస్‌గా అధ్యయనం చేయడం రాములు ప్రత్యేకత. ఒక వకుళాభరణం, ఒక ఐలయ్య వంటి వారు అధ్యయనానికి, తాత్విక చింతన వ్యాప్తికి పరిమితమైతే రాములు ఇంకో అడుగు ముందుకేసి సృజనాత్మక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో మానవ సంబంధాల పరిణామ శ్రీలతను తనదైన పద్ధతిలో నమోదుచేశారు. అందుకే సృజనాత్మక, సామాజిక తత్వవేత్తగా అందరి మన్ననలూ పొందగలిగారు.
ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథాన్ని ఎలా విశ్లేషించాలో తన రచనల ద్వారా నిరూపించే బి.ఎస్‌.రాములు 1949 ఆగస్టు ఇరవైమూడో తేదీ కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో జన్మించారు. బేతి లక్ష్మిరాజు, నారాయణ తల్లిదండ్రులు. తండ్రి బొంబాయి బట్టలమిల్లు కార్మికుడు. ఆరోయేటే తండ్రి మరణాన్ని చూసిన రాములుకి కళ్ళు చెమర్చడం అప్పట్నించే మొదలైంది. తల్లి బీడీలు చుడుతూ వచ్చే అణా పైసలతో కుటుంబ పోషణం చేస్తుంటే తన లేతహృదయం తీవ్రంగా స్పందించేది. పేదరికం అంటే ఏమిటో నిర్వచనాలు అక్కర్లేకుండానే... దుర్భర దారిద్య్రంలో తన తొలి అడుగులు వేసిన రాములు తెలంగాణలో వందల ఎకరాల భూస్వాముల అరాచకాలు కళ్ళముందు కదులుతుంటే భూమిలేని వేలాది నిరుపేదల ఆక్రందనలు చెవుల్లో మారుమోగేవి. రజాకార్ల గురించి చదివిన రాములు, మతపరమైన విశ్వాసాలతో చెలరేగిన ఆందోళనలను ప్రత్యక్షంగా చూశారు. సహజంగానే, సాంస్కృతిక అతివాద భావజాలానికి ఆకర్షితులై, సంస్కృతీకరణను (సాంస్క్రిటైజేషన్‌) విశ్వసించారు. అందుకే 1967 నుంచి 1972 వరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ముఖ్యశిక్షక్‌గా పనిచేశారు. జగిత్యాల మార్కజీ పాఠశాల విద్య పూర్తిచేశారు. చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో రచనలు విస్తృతంగా చదివారు. బాలసాహిత్యం నుంచి ప్రేరణ పొందిన రాములు 1963-64 ప్రాంతాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నపుడే చిన్న చిన్న రచనలు చేశారు. పాఠశాల ప్రత్యేక సంచిక 'స్రవంతి'లో అవి అచ్చయినపుడు ఆయన ఆనందానికి అవధుల్లేవు! అయితే 1968లో 'బాలమిత్ర' జనవరి సంచికలో 'జగిత్యాల కథ' పేరుతో అచ్చయిన తన తొలిరచనను ఇప్పటికీ మరచిపోలేరు. బయటి ప్రపంచానికి తనని రచయితగా పరిచయం చేసిన రచన అది! ఇక అప్పట్నించీ రచయితగా ఆయన కలానికి తిరుగేలేదు!
బి.ఎస్‌.రాములు ఎదిగేకొద్దీ జీవితంలో లోతు పాతుల్ని, వివిధ వాదాల్ని అవగతం చేసుకొన్నారు. విప్లవవాదం, దళిత వాదం, స్త్రీ వాదం వంటి ఏ ఒక్కవాదమో కాక అన్ని వాదాల్ని అవగతం చేసుకొని అవి ప్రవచించే మానవాభ్యుదయ లక్ష్యాన్ని పట్టుకొన్నారు రాములు. 'గతం'లో కూరుకుపోక, వర్తమానంలో తేలిపోక నడుస్తున్న చరిత్రకు తన రచనల్ని దర్పణం చేశారు. సాహిత్య సమావేశాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తూచైతన్యం కోసం కృషిచేశారు. నిరుపేద ప్రజల ఉద్ధరణకు పనికొచ్చే పనిచేయాలని సంకల్పించిన రాములు జిల్లాస్థాయిలో పౌరహక్కుల సంఘం, అంబేద్కర్‌ సంఘాలు, విప్లవ సంఘాలలో సభ్యత్వం పొంది ఆ దిశగా కృషి ప్రారంభించారు. 1980లో 'విరసం'లో సభ్యత్వం పొందారు. ఆ సంసవత్సరమే తన ఉద్యోగానికి సెలవుపెట్టారు. 1983లో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అయ్యారు. 1984-88ల మధ్య రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే ఆ కాలంలోనే ఆయన గద్దర్‌, వరవరరావు, సంజీవ్‌ తదితరులతో కలసి అఖిలభారత పర్యటనకు వెళ్లడమేకాక అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసి వచ్చింది. ఎన్‌.వేణుగోపాల్‌ మాటల్లో చెప్పాలంటే- బి.ఎస్‌. - ''1980 దశకమంతా హనుమకొండలోనూ, హైదరాబాద్‌లోనూ, బెజవాడలోనూ, అజ్ఞాతంలోనూ, ముమ్మరమైన ప్రజాజీవిత ఆచరణలో చాలా సన్నిహితుడయ్యాడు. కథకుడిగా, విరసం సభ్యుడిగా, రాడికల్‌ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా 1985-89 నిర్బంధకాలంలో, ఆ నిర్బంధాన్ని ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా తిరిగిన బృందం సభ్యుడిగా, అజ్ఞాత కార్యకర్తగా'' బి.ఎస్‌కి ఎన్నో అనుభవాలున్నాయి.
బి.ఎస్‌.రాములు 1990లో తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చారు. 1992లో ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. ''కథకుడిగా ఆయన తెలంగాణా ప్రజల దీనస్థితిని అక్షరీకరించారు. కాలువ మల్లయ్య రాములు కథల్ని మూడు భాగాలుగా వర్గీకరించారు.
* విప్లవ సాహిత్య అవగాహనలో భాగంగా 1990 దాకా రాసిన కథలు
* తాత్విక సైద్ధాంతిక గ్రంథాలు రాసిన గాఢతతో రాసిన దళిత, బహుజన స్త్రీవాద కథలు.
* సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, మానవ సంబంధాల కథలు.
రాములు 25కి పైగా కథలు రాశారు. ఆరు నవలలు, నూటయాభై సిద్ధాంత వ్యాసాలు, అన్నీ సాహిత్య వ్యాసాలు, పది తాత్విక గ్రంథాలు రాశారు. పాలు, చదువు, స్మృతి, మమతలూ- మానవ సంబంధాలు, వేపచెట్టు వంటి కథల సంపుటాలు, బతుకు పోరు వంటి నవలలు ఆయనకి బాగా పేరుతెచ్చాయి. జ్ఞానం పుట్టుక, బీసీలు ఏంచేయాలి, నెనెవరు గతి తర్క తత్వ దర్శన భూమిక, బహుజన తత్వం, ప్రేమంటే ఏమిటి?, భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజనులారా వంటి తాత్విక గ్రంథాలు, సమగ్ర సామాజిక కథ, కథలబడి - కథా సాహిత్య అలంకార శాస్త్రం వంటి రచనలు చేశారు. ఇంకా ఉద్యమకథలు, తెలంగాణా వ్యాసాలు, కన్యాశుల్కంను ఎలాచూడాలి, సాహిత్య చరిత్రను కొత్తచూపుతో ఎలా తిరగరాయాలి? సాహిత్య చరిత్రను కొత్త చూపుతో ఎలా తిరగరాయాలి? పాట పుట్టుక, దళిత సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యంలో సమాజ అన్వేషణ వంటి గ్రంథాలెన్నో రాశారు. కత్తి పద్మారావు అన్నట్లు ''బి.ఎస్‌.రాములు గారొక తాత్విక విశ్వవిద్యాలయం''. అందుకే ఆయన ''సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం'' పేరుతో వివిధ అంశాలపై సదస్సులు, చర్చలు, కథాపురస్కారాలు ఏర్పాటుచేస్తున్నారు. విశాల సాహితీ పురస్కారాలను ఇప్పటివరకు ఓ ముప్ఫై మంది కథల సంపుటాలకు ప్రదానం చేయడం విశేషం. వీరికథలు పాలు, బడి, సహజాతాలును ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగులో పాఠ్యాంశాలుగా నిర్ణయించింది. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ విద్యార్థులకి పాఠ్యాంశంగా ఉంది. 'సదువు'కథ గ్రూప్‌-1 సర్వీసెస్‌ వారికి తెలుగు పరీక్షల్లో పాఠ్యాంశమైంది. బి.ఎస్‌.రాములు, కథకుడిగా హేతువాదిగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు అందుకొన్నారు. దాశరథి రంగాచార్య పురస్కారం, కొండాలక్ష్మణ్‌బాపూజీ ఫౌండేషన్‌ పురస్కారం, పాల్కురికి సోమన పురస్కారం వంటి వెన్నో పొందారు. సాహిత్యం అంటే బువ్వపెట్టేదనీ, భూమి దక్కించేదనీ, జులుం నెదిర్చే రక్తకణాలని కొత్త అర్థం ఇచ్చిన తాత్వికుడు బి.ఎస్‌.రాములు. ఆయనే ఒక విశ్వవిద్యాలయం!

No comments:

Post a Comment