Analytics

20va Sataabdapu Mahaakavi Nerodaa

తెలుగు కవుల మార్గదర్శి
20వ శతాబ్దపు మహాకవి నెరూడా
- చీకోలు సుందరయ్య
వాల్మీకి, కాళిదాసు, భారవి వంటి పూర్వుల ప్రభావంతో రచనలు చేసిన కాలం చెల్లిపోయి, తదనంతర కాలాల్లో ముందుతరం కవుల ప్రభావంతో రచనలు చేసే కాలం ఆవిర్భవించింది. ఆంగ్ల ప్రకృతి కవులు... కాల్పనిక కవులు మన భావకవుల్ని ఎంతగా ప్రభావితం చేశారో రష్యన్‌, ఫ్రెంచి... తదితర భాషా రచనయితలు అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపారు.
''నా కవిత్వం గురించి నన్నడగకండి
కర్షకుణ్ణడగండి, కార్మికుణ్ణడగండి
అతని నుండొచ్చిందే నా కవిత్వం
అతడే నాకు మహాకవి...''
ఆధునికుల రచనలతో పరిచయమైన వారికి ఈ పంక్తులు ''పాబ్లోనెరూడా''వి అని తెలుస్తుంది! ఈ స్పానిష్‌ కవిని ప్రతి ఆధునిక తెలుగుకవి తన సొంతం చేసుకోవడం గమనార్హం. వచన కవిత్వం రాస్తోన్నవారిలో రైట్‌, లెఫ్ట్‌ అనే తేడాలేకుండా అందర్నీ ప్రభావితం చేసిన కవి పాబ్లోనెరూడూ...
కె.శివారెడ్డి, వరవరరావు, అద్దేపల్లి రామ్మోహనరావులే కాదు సి.వి.కృష్ణారావు, సుమనశ్రీ ఆశారాజు, ఎండ్లూరి సుధాకర్‌, వెలిచాల కొండలరావు వాడ్రేవు చినవీరభద్రుడు, సిద్ధార్థ... ఇలా ఎవరి ప్రసంగం విన్నా పాబ్లో నెరూడా పేరు వినిపిస్తుంది.

ఎక్కడో ఓ సందర్భంలో ఆయన ప్రస్తావన రాకుండా సాహిత్యం గురించి చర్చ సమాప్తం కాదు. కొండలరావు మాటల్లో చెప్పాలంటే -
''ఆలోచనల్లో, అభివ్యక్తిలో సరికొత్త పుంతలు తొక్కిన కవి
భావాన్నీ భాషనీ రెంటినీ అదనంగా ఆలోచనాత్మకంగా పుట్టించిన కవి
అర్థాలకు సరికొత్త అర్థాలు కనుగొన్న కవి
ఆర్ద్రతను మరింత ఆర్ద్రతతో
సౌందర్యాన్ని మరింత సౌందర్యంతో అందించన కవి...''
దేశాల తేడాలు లేకుండా అన్ని దేశాల్లోను, అందరు ముక్తకంఠంతో ఇరవయ్యో శతాబ్దపు మహాకవిగా కీర్తించిన కవి పాబ్లోనెరూడా. ఇటీవలే ఆయన శతజయంతి వేడుకలు ముగిశాయి. ఆయన తల్లిదండ్రులు కార్మికులు. తండ్రి రైల్వే వర్కర్‌ అయితే తల్లి ప్రాథమిక స్కూలు టీచర్‌. దక్షిణ చిలీలో బాగా వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన నెరూడా చిన్నతనం నుంచీ కవిత్వాన్నే తన ఉనికిగా, జెండాగా, ఎజెండాగా మార్చుకొన్నారు.

ఆయన ఇరవయ్యేళ్ల వయసులో ఉన్నపుడు ''ట్వంటీ పొయెమ్స్‌ ఆఫ్‌ లవ్‌ అండ్‌ ఎ సాంగ్‌ ఆఫ్‌ డిస్పెయిర్‌...'' ప్రచురించారు. ఆ కవితలు పెద్ద, చిన్నతేడా లేకుండా అందర్నీ ఆకట్టుకొన్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ ఆ కవితలు తమ హృదయ స్పందనలుగా గుర్తించారు. ''కాంటో జనరల్‌, హెయిట్స్‌ ఆఫ్‌ మచ్చు, పిచ్చు'' వంటివి ఆయన తమకోసమే రాశారని దక్షిణ అమెరికా మొదలుకొని అందరూ వాటితో మమేకం చెందారు. 

నెరూడా పసిఫిక్‌ మహాసముద్రాన్ని ఎంత గాఢంగా ప్రేమించారో, జీవితంలో అత్యంత సాధారణమైన వస్తువుల్ని సైతం అంతే గాఢంగా ప్రేమించారు. 'ఇస్లానెగ్నా' అనే తన ఇంటిని ఆయన పసిఫిక్‌ మహాసముద్రానికి ఎదురుగానే నిర్మించుకోవడం విశేషం. ఆయన విమర్శకులు పేర్కొన్నట్లు ఆయన సిరాతో రాయలేదు... రక్తంతోనే రాశారు...! అంతే ప్రేమతో రాశారు. పీపుల్‌ అనే ఒక కవిత అందుకు నిదర్శనంగా ఇలా సాగుతుంది -
''అతడు నాకు బాగా గుర్తు
ఎప్పుడో కొన్ని వేలవేల ఏళ్ల క్రితం చూశానతణ్ని మొదటిసారి
అతడు గుర్రాలెక్కలేదు, బళ్లూ ఎక్కలేదు
పల్లకీలో ఊరేగలేదు
అనంత దూరాలన్నీ మొద్దుబారి చీలిన
తన నగ్న పాదాలపైనే గమించాడు
అతని చేతుల్లో కత్తులూ, కటార్లూ ఎప్పుడూ చూళ్లేదు నేను
భుజంపై సుత్తీ, కొడవలి, గొడ్డలి, పార, నాగలి
అతని అస్తిత్వంలో ఓ భాగం
తనవాళ్లతో ఎప్పుడూ పోట్లాడలేదతను
అతని పోరాటం అంతా నేల, సీళ్లూ, ప్రకృతి
క్రూర కర్కోటకాలతో
ఆకాశన్నంటే చెట్లను కూల్చి ఇళ్లను దూలాల్నీ
కిటికీల్నీ అమరుస్తాడు
మట్టితో గోడల్ని, గోడలకు తలుపులు తెరుస్తాడు
సుళ్లు తిరిగే సముద్రంలోకి
రత్నరాశులు తెస్తాడు
మానవ కోటికి ప్రాణదానం చేస్తాడు
ఇలా సాగే పాబ్లోనెరూడా కవితలకు అన్నిదేశాల్లో పాఠకులున్నారు. ఒక అంచనా ప్రకారం ఇరవయ్యో శతాబ్దంలోని ఆయన సమకాలికుల్లో అత్యధిక సంఖ్యలో పాఠకులు ఎవరి కవిత్వమైనా చదివి ఉంటే అది ఆయన కవిత్వాన్నే... నెరూడా కర్షక, కార్మిక సంక్షేమం ఎలా కోరారో అంతర్జాతీయంగా జాతుల సమైక్యతను అంతగానే కోరారు. చిలీలో స్పానిష్‌ అంతర్యుద్ధాలు సమసిపోవాలని కోరారు. చిలీలోని ఈతరం కవులు ఇసబెల్‌ అలెండె, ఆంటోనియోస్కర్మెట, జార్జ్‌ ఎడ్వర్డ్స్‌ వంటివారికి ఆదర్శంగా నిలిచారు.

నెరూడాది పసిపిల్లల మనస్తత్వం. ఆయన సముద్రం సమీపంలోని ఆలుచిప్పలు, నదుల్లోని గుండ్రటిరాళ్లు, ఆఫ్రికాలో లభ్యమయ్యే మాస్క్‌లు ఇలా అన్నీ సేకరించారు. ఆయన గృహంలో ఇప్పటికీ అవి ప్రదర్శితమయ్యాయి.

విమర్శకులు ఆయన ''రెసిడెన్స్‌ ఆన్‌ ఎర్త్‌''ని మాగ్నమ్‌ ఓపస్‌గా పరిగణిస్తారు. ఆయన ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటించారు. బర్మా, శ్రీలంక, ఒటావియా, జావా, సింగపూర్‌లు సందర్శించి 1928 ప్రాంతాల్లో కలకత్తా వచ్చారు. ఆ సంవత్సరం కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సదస్సులో పాల్గొని గాంధీజీ, నెహ్రూజీ వంటి నాయకుల్ని కలిశారు. ఆయన మద్రాసు నగరం సందర్శించినపుడు మన దేశ స్త్రీలు చీరలు ధరించిన వైనానికి ముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఆయన 1957లో మళ్లీ భారత్‌ పర్యటించారు.

తన అనుభవాలతో ఆయన ''ఇండియా'' అనే దీర్ఘకవిత రాశారు. భారతదేశంలో తొలిసారిగా బెంగాలీలు ఆయన రచనల వల్ల ప్రభావితులయ్యారు. ఆ తర్వాత అన్నిభాషలవారూ అయ్యారు. ఇలాన్‌ స్టావెన్స్‌, పాబ్లో నెరూడా కవిత్వాన్ని ''ద పొయెట్రీ ఆఫ్‌ పాబ్లో నెరూడా'' పేరుతో వెయ్యి పుటల గ్రంథం ముద్రించారు.

2003లో ప్రచురితమైన ఈ పుస్తకంలో దాదాపు ఆరు వందల కవితలున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చంద్రబాలి సింగ్‌ సంకలించిన ''కవితా సంచయన్‌'' పాబ్లో నెరూడా కవితల్ని హిందీ పాఠకులకు పరిచయం చేస్తోంది. మలయాళంలో సచ్చిదానందన్‌ (అకాడెమీ కార్యదర్శి) ఎన్నో కవితలు అనువదించి ప్రచురించారు. 

తెలుగులో ఇప్పటి వారిలో కె.శివారెడ్డి, చంద్రమౌళి, దేవరాజు మహారాజు, త్రిపురనేని శ్రీనివాస్‌, నగ్నముని, నిర్మలానంద, వెలిచాల కొండలరావు వంటివారు ఎన్నో కవితలు అనువదించారు. తెలుగు కవులు ఎక్కువగా చదివేది, స్ఫూర్తి పొందేది నెరూడా కవితల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించిన కవి నిస్సందేహంగా నెరూడా మాత్రమే!

No comments:

Post a Comment