Analytics

Vijnaanakhani Cheemakurti

విజ్ఞానఖని చీమకుర్తి
విజ్ఞాన సర్వస్వాలు చూసే అలవాటున్న వారికి ఒక పేరు తరచూ కనిపిస్తుంటుంది. తెలుగుభాష, సంస్కృతి, చరిత్రలకు సంబంధించి మనం ఏంమరచిపోయామో, మనకెంత తెలుసో అన్న ప్రస్తావన వచ్చినప్పుడు సైతం విద్వాంసులు ఆయన పుస్తకం చూడమంటారు. అంతేనా? తెలుగుభాషకి పాళీభాషకి ఏదైనా సంబంధం ఉందా? తెలుగులో పాళీపదసంపద ఎంత? తెలుసుకోవాలన్న ఆయన రచనలు పరిశీలించక తప్పదు. తెలుగు భాషకు, సాహిత్యానికి విశేషమైన సేవచేసిన ఆయనే చీమకుర్తి శేషగిరిరావు. ఇతరులను నొప్పించని ప్రవర్తన, అరుదైన ధైర్యసాహసాలు వ్యక్తంచేసిన గాంధేయవాది చీమకుర్తి. వేదోపనిషత్తులతో పాటు, శాస్త్రపరిజ్ఞానం, చరిత్ర, రాజనీతి, లలితకళలు, భాషా శాస్త్రాలపట్ల అవగాహన అన్నీ ఆయన్ని అసమాన మేధావిగా మార్చాయనడంలో సందేహంలేదు.
చీమకుర్తి ఇంటిపేరు చిల్లర. ఆయన తల్లిదండ్రులు ఆదెమ్మ, ఆదినారాయణలు. 1913 జూన్‌ 14న గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా వెల్లటూరులో జన్మించారు. వీరి ప్రాథమిక విద్య చేబ్రోలు, మాధ్యమిక విద్య తెనాలిలో జరిగింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో బి.ఎ. రెండో సంవత్సరం పూర్తిచేసి మహాత్మాగాంధీజీ పిలుపునందుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో దుమికారు. ఆయనకి పదమూడేళ్ల వయసులో చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ దంపతులు ఆయన్ని దత్తత తీసుకోవడంతో అప్పట్నించీ ఇంటిపేరు మారింది. చీమకుర్తి గ్రామంలో రైతులకు చెందాల్సిన మాన్యం, మాన్యం భూముల్ని భూస్వాములు అనుభవిస్తుండడంతో శేషగిరిరావు ఆ రైతులకు నాయకత్వం వహించారు. అహింసామార్గంలో ఆ భూముల్ని రైతులకు ఇప్పించారు. అది ఆయన సాధించిన తొలి విజయం. అది ఆయనలో ఉత్సాహం నింపింది. అది జరిగింది ముప్పైలలో. ఆయన వయసు పట్టుమని పాతికేళ్లు కూడా లేని తరుణంలో. అప్పట్నించీ ఆయన గాంధీ మార్గంలో పయనించారు. ఖద్దరు ధరించడం, నూలు వడకడం వంటివి నిత్యకృత్యాలయ్యాయి. దాదాపు అదే సమయంలో ఉప్పుసత్యాగ్రహం కూడా రానే వచ్చింది. అప్పట్లో అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆవిష్కరించిన విజయ ధ్వజం ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఆయన ఒంగోలు తాలూకా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి అయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అప్పట్లో కనుపర్తి గ్రామ సమీపంలోని ఉప్పుకొఠారు నుంచి ఉప్పు సంగ్రహించి తెల్లవారి పట్ల తన తిరుగుబాటు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులు వెంటపడడంతో అజ్ఞాత వాసంలోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతివాద భయంకర వెంకటాచారి, అచ్యుత పట్వర్థన్‌, జయప్రకాశ్‌నారాయణ్‌ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. గుంటూరు, బొంబాయి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఒంగోలు చేరుకుని బాంబులు తయారుచేశారు. ఆ విషయం పసిగట్టిన పోలీసులు ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిన చీమకుర్తి గుంటూరు, నెల్లూరు, బాపట్ల మొదలైన ప్రాంతాల్లో చాలాకాలం మారువేషాలతో కాలం గడపవలసి వచ్చింది. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రకాశం ప్రీమియర్‌గా పదవీస్వీకారం చేసిన తర్వాత చీమకుర్తి పైన వున్న వారెంటు రద్దయింది.
చీమకుర్తి సాహిత్య జీవితం ఆయన మద్రాసులో తెలుగు భాషాసమితిలో చేరడంతో మొదలైంది. అక్కడ గిడుగు సీతాపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి వారిని కలిశారు. వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. చిన్న చిన్న రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మద్రాసు నుంచి విడివడిన తర్వాత తెలుగు భాషా సమితి హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రధాన సంగ్రాహకుడిగా ఆయన వివిధ గ్రంథాలు ముద్రించారు. ''హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ఆంధ్రాస్‌'' అనే ఆంగ్ల సంపుటానికి తొలిసారిగా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందిన ఆ గ్రంథం తర్వాత రెండో గ్రంథం ''విజ్ఞాన సర్వస్వం'', తర్వాత విశ్వసాహితి, లలితకళలు, చరిత్ర, రాజనీతి వంటి గ్రంథాలకు సంగ్రాహకుడిగా పనిచేశారు. విజ్ఞాన సర్వస్వంలో ఎన్నో వ్యాసాలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన ''ప్రపంచ రాజసర్వస్వము'' సంపుటానికి కూడా సంపాదకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో 'తెలుగు గోష్ఠి' అనే సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులై ఆ సంస్థ పక్షాన - ''తెలుగు మఱుగులు, ఫర్గాటెన్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ తెలుగు, తెలుగు మఱుగులు రెండో భాగం, తెలుగులో పాళీపదాలు, ఉత్పత్తి పిడుగు మొదలైన గ్రంథాలు ప్రచురించారు. ఒంగోలులో ప్రకాశం విగ్రహం ప్రతిష్ఠించిన సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికకి కూడా ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన పేదవిద్యార్థులకు విరివిగా సాయం చేయడమేకాక తన గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి తన భూమిని ఉచితంగా అందచేయడం విశేషం. ఎనభైలలో ఆయన దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. బుద్ధుడిపై ఆయనకి ప్రత్యేక మమకారం. 1994 ఏప్రిల్‌లో నేపాల్‌ సందర్శించారు. తిరుగు ప్రయాణంలో రుషీకేశ్‌ చేరుకుని ఇంటికొస్తూ 1994 సెప్టెంబరు పదహారో తేదీ భోపాల్‌లో పరమపదించారు. చీమకుర్తి భాషాసేవ నిరుపమానం.

Aadhunika Taatvikudu B.S.Raamulu

ఆధునిక తాత్వికుడు బి.ఎస్‌.రాములు
వ్యక్తికి సమాజానికి సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుంది. వ్యక్తి సమాజంలో భాగంగా జీవిస్తాడు. సమాజంలో భాగంగా రూపుదిద్దుకుంటాడు. సమాజం పరిణామ శీలమైనది. సమాజ క్రమాన్ని వ్యక్తులు, శక్తులు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు సామాజిక వైరుధ్యాలు, సామాజిక వైవిధ్యాలు, పరస్పర ఐక్యత, ఘర్షణ, సహజీవనం, పరిమాణాత్మక గుణాత్మక మార్పుల క్రమాలు నిర్దేశిస్తాయి... ఈ దృష్టితో చరిత్రను అధ్యయనం చేయడాన్ని చారిత్రక భౌతికవాదం అంటారని పుస్తకాల్లో చదువుతుంటాం. అయితే ఆ విధమైన అధ్యయనం చేసిన సామాజిక తత్వవేత్త బి.ఎస్‌.రాములు. ఆధునిక సమాజంలో సాహిత్యాన్ని, సమాజాన్ని రెంటినీ అంతే సీరియస్‌గా అధ్యయనం చేయడం రాములు ప్రత్యేకత. ఒక వకుళాభరణం, ఒక ఐలయ్య వంటి వారు అధ్యయనానికి, తాత్విక చింతన వ్యాప్తికి పరిమితమైతే రాములు ఇంకో అడుగు ముందుకేసి సృజనాత్మక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో మానవ సంబంధాల పరిణామ శ్రీలతను తనదైన పద్ధతిలో నమోదుచేశారు. అందుకే సృజనాత్మక, సామాజిక తత్వవేత్తగా అందరి మన్ననలూ పొందగలిగారు.
ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథాన్ని ఎలా విశ్లేషించాలో తన రచనల ద్వారా నిరూపించే బి.ఎస్‌.రాములు 1949 ఆగస్టు ఇరవైమూడో తేదీ కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో జన్మించారు. బేతి లక్ష్మిరాజు, నారాయణ తల్లిదండ్రులు. తండ్రి బొంబాయి బట్టలమిల్లు కార్మికుడు. ఆరోయేటే తండ్రి మరణాన్ని చూసిన రాములుకి కళ్ళు చెమర్చడం అప్పట్నించే మొదలైంది. తల్లి బీడీలు చుడుతూ వచ్చే అణా పైసలతో కుటుంబ పోషణం చేస్తుంటే తన లేతహృదయం తీవ్రంగా స్పందించేది. పేదరికం అంటే ఏమిటో నిర్వచనాలు అక్కర్లేకుండానే... దుర్భర దారిద్య్రంలో తన తొలి అడుగులు వేసిన రాములు తెలంగాణలో వందల ఎకరాల భూస్వాముల అరాచకాలు కళ్ళముందు కదులుతుంటే భూమిలేని వేలాది నిరుపేదల ఆక్రందనలు చెవుల్లో మారుమోగేవి. రజాకార్ల గురించి చదివిన రాములు, మతపరమైన విశ్వాసాలతో చెలరేగిన ఆందోళనలను ప్రత్యక్షంగా చూశారు. సహజంగానే, సాంస్కృతిక అతివాద భావజాలానికి ఆకర్షితులై, సంస్కృతీకరణను (సాంస్క్రిటైజేషన్‌) విశ్వసించారు. అందుకే 1967 నుంచి 1972 వరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ముఖ్యశిక్షక్‌గా పనిచేశారు. జగిత్యాల మార్కజీ పాఠశాల విద్య పూర్తిచేశారు. చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో రచనలు విస్తృతంగా చదివారు. బాలసాహిత్యం నుంచి ప్రేరణ పొందిన రాములు 1963-64 ప్రాంతాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నపుడే చిన్న చిన్న రచనలు చేశారు. పాఠశాల ప్రత్యేక సంచిక 'స్రవంతి'లో అవి అచ్చయినపుడు ఆయన ఆనందానికి అవధుల్లేవు! అయితే 1968లో 'బాలమిత్ర' జనవరి సంచికలో 'జగిత్యాల కథ' పేరుతో అచ్చయిన తన తొలిరచనను ఇప్పటికీ మరచిపోలేరు. బయటి ప్రపంచానికి తనని రచయితగా పరిచయం చేసిన రచన అది! ఇక అప్పట్నించీ రచయితగా ఆయన కలానికి తిరుగేలేదు!
బి.ఎస్‌.రాములు ఎదిగేకొద్దీ జీవితంలో లోతు పాతుల్ని, వివిధ వాదాల్ని అవగతం చేసుకొన్నారు. విప్లవవాదం, దళిత వాదం, స్త్రీ వాదం వంటి ఏ ఒక్కవాదమో కాక అన్ని వాదాల్ని అవగతం చేసుకొని అవి ప్రవచించే మానవాభ్యుదయ లక్ష్యాన్ని పట్టుకొన్నారు రాములు. 'గతం'లో కూరుకుపోక, వర్తమానంలో తేలిపోక నడుస్తున్న చరిత్రకు తన రచనల్ని దర్పణం చేశారు. సాహిత్య సమావేశాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తూచైతన్యం కోసం కృషిచేశారు. నిరుపేద ప్రజల ఉద్ధరణకు పనికొచ్చే పనిచేయాలని సంకల్పించిన రాములు జిల్లాస్థాయిలో పౌరహక్కుల సంఘం, అంబేద్కర్‌ సంఘాలు, విప్లవ సంఘాలలో సభ్యత్వం పొంది ఆ దిశగా కృషి ప్రారంభించారు. 1980లో 'విరసం'లో సభ్యత్వం పొందారు. ఆ సంసవత్సరమే తన ఉద్యోగానికి సెలవుపెట్టారు. 1983లో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అయ్యారు. 1984-88ల మధ్య రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే ఆ కాలంలోనే ఆయన గద్దర్‌, వరవరరావు, సంజీవ్‌ తదితరులతో కలసి అఖిలభారత పర్యటనకు వెళ్లడమేకాక అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసి వచ్చింది. ఎన్‌.వేణుగోపాల్‌ మాటల్లో చెప్పాలంటే- బి.ఎస్‌. - ''1980 దశకమంతా హనుమకొండలోనూ, హైదరాబాద్‌లోనూ, బెజవాడలోనూ, అజ్ఞాతంలోనూ, ముమ్మరమైన ప్రజాజీవిత ఆచరణలో చాలా సన్నిహితుడయ్యాడు. కథకుడిగా, విరసం సభ్యుడిగా, రాడికల్‌ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా 1985-89 నిర్బంధకాలంలో, ఆ నిర్బంధాన్ని ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా తిరిగిన బృందం సభ్యుడిగా, అజ్ఞాత కార్యకర్తగా'' బి.ఎస్‌కి ఎన్నో అనుభవాలున్నాయి.
బి.ఎస్‌.రాములు 1990లో తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చారు. 1992లో ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. ''కథకుడిగా ఆయన తెలంగాణా ప్రజల దీనస్థితిని అక్షరీకరించారు. కాలువ మల్లయ్య రాములు కథల్ని మూడు భాగాలుగా వర్గీకరించారు.
* విప్లవ సాహిత్య అవగాహనలో భాగంగా 1990 దాకా రాసిన కథలు
* తాత్విక సైద్ధాంతిక గ్రంథాలు రాసిన గాఢతతో రాసిన దళిత, బహుజన స్త్రీవాద కథలు.
* సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, మానవ సంబంధాల కథలు.
రాములు 25కి పైగా కథలు రాశారు. ఆరు నవలలు, నూటయాభై సిద్ధాంత వ్యాసాలు, అన్నీ సాహిత్య వ్యాసాలు, పది తాత్విక గ్రంథాలు రాశారు. పాలు, చదువు, స్మృతి, మమతలూ- మానవ సంబంధాలు, వేపచెట్టు వంటి కథల సంపుటాలు, బతుకు పోరు వంటి నవలలు ఆయనకి బాగా పేరుతెచ్చాయి. జ్ఞానం పుట్టుక, బీసీలు ఏంచేయాలి, నెనెవరు గతి తర్క తత్వ దర్శన భూమిక, బహుజన తత్వం, ప్రేమంటే ఏమిటి?, భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజనులారా వంటి తాత్విక గ్రంథాలు, సమగ్ర సామాజిక కథ, కథలబడి - కథా సాహిత్య అలంకార శాస్త్రం వంటి రచనలు చేశారు. ఇంకా ఉద్యమకథలు, తెలంగాణా వ్యాసాలు, కన్యాశుల్కంను ఎలాచూడాలి, సాహిత్య చరిత్రను కొత్తచూపుతో ఎలా తిరగరాయాలి? సాహిత్య చరిత్రను కొత్త చూపుతో ఎలా తిరగరాయాలి? పాట పుట్టుక, దళిత సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యంలో సమాజ అన్వేషణ వంటి గ్రంథాలెన్నో రాశారు. కత్తి పద్మారావు అన్నట్లు ''బి.ఎస్‌.రాములు గారొక తాత్విక విశ్వవిద్యాలయం''. అందుకే ఆయన ''సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం'' పేరుతో వివిధ అంశాలపై సదస్సులు, చర్చలు, కథాపురస్కారాలు ఏర్పాటుచేస్తున్నారు. విశాల సాహితీ పురస్కారాలను ఇప్పటివరకు ఓ ముప్ఫై మంది కథల సంపుటాలకు ప్రదానం చేయడం విశేషం. వీరికథలు పాలు, బడి, సహజాతాలును ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగులో పాఠ్యాంశాలుగా నిర్ణయించింది. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ విద్యార్థులకి పాఠ్యాంశంగా ఉంది. 'సదువు'కథ గ్రూప్‌-1 సర్వీసెస్‌ వారికి తెలుగు పరీక్షల్లో పాఠ్యాంశమైంది. బి.ఎస్‌.రాములు, కథకుడిగా హేతువాదిగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు అందుకొన్నారు. దాశరథి రంగాచార్య పురస్కారం, కొండాలక్ష్మణ్‌బాపూజీ ఫౌండేషన్‌ పురస్కారం, పాల్కురికి సోమన పురస్కారం వంటి వెన్నో పొందారు. సాహిత్యం అంటే బువ్వపెట్టేదనీ, భూమి దక్కించేదనీ, జులుం నెదిర్చే రక్తకణాలని కొత్త అర్థం ఇచ్చిన తాత్వికుడు బి.ఎస్‌.రాములు. ఆయనే ఒక విశ్వవిద్యాలయం!

Badilo Chadavani Bahu Granda Rachayita Raambhatla

బడిలో చదవని బహు గ్రంథ రచయిత
రాంభట్ల
దువు లేని వ్యక్తి కోట్లు గడించారంటే అశ్చర్యపోనక్కర లేదు. వందల ఎకరాల మాగాణికి యజమాని అంటే అసలే ఆలోచించ నక్కరలేదు. కానీ మూడో తరగతి మూడు చోట్ల మూడుసార్లు చదివిన వ్యక్తి, ఆ తర్వాత భాగ్య నగరం చేరుకొని ఆ మూడో తరగతి మళ్లీ చదివి, అలా అయిదో తరగతి వరకు మాత్రమే చదివి ఆపేసిన తర్వాత తాను లక్షలాది మందిని చైతన్యపరచే వ్యాసాలు, గ్రంథాలు రాశారంటే నమ్మలేం. కాశీ మజిలీ కథ అని అనుకోవచ్చు. లేదా కాళిదాసు నాలుక మీద కాళికాదేవి బీజాక్షరాలు రాసినట్లు ఈ కలికాలంలో అటువంటిదేమైనా జరిగిందని భ్రమ పడాల్సి ఉంటుంది. రాంభట్ల కృష్ణమూర్తి గురించి ఏమాత్రం తెలిసినవారైనా అది కథ అనుకోలేరు. నిజమని నమ్ముతారు. అపారమైన ఆయన విజ్ఞానానికి జోహార్లు సమర్పిస్తారు!
తూర్పు గోదావరి జిల్లా అనాతవరంలో 1920 మార్చి నెల 24న జన్మించిన రాంభట్ల మాట్లాడే విజ్ఞాన సర్వస్వంగా మిత్రులు, సన్నిహితుల ప్రశంసలందుకొన్నారు. కదిలే గ్రంథాలయంగా కీరి పొందారు. ''వినే ఓపిక ఉండాలే కానీ మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపగల సమర్థుడు. మంచి వక్త. తెలుగుదనంతో మాట్లాడగల తెలుగువాడు. ''శశ విశాణం'' గీతాల కవి. వివిధ సంస్కృతులూ, తాత్త్వికతల అధ్యయనం మీద ఆసక్తి గల వ్యక్తి. సమకాలీన తెలుగు జర్నలిజానికి సొగసులందించారు. కార్టూన్‌ను ఓ ఉద్యమంగా చేపట్టి ప్రజా చైతన్యానికి వినియోగించిన తొలి రాజకీయ కార్టూనిస్టు. ఈనాటి జర్నలిస్టుల్లో- కార్టూనిస్టుల్లో చాలా మంది రాంభట్లకు ప్రత్యక్ష- పరోక్ష శిష్యులనడంలో ఆశ్చర్యం లేదు.'' అంటారు ఆయన స్నేహితులు. 'తెలుగు గోష్ఠి'కి చెందిన సీనియర్‌- మల్లిక్‌ మాటల్లో చెప్పాలంటే- ''జీవితంలో ఆయనకి ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి సన్మానాలూ చేయలేదు. చేస్తామన్నా ఆయన ఒప్పుకోలేదు. అందువల్ల ఇవి బిరుదులో కితాబులో కావు. ఆయన వల్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలకు లోనైన వారు ఆయనతో సంభాషణ అనే జ్ఞాన సంద్రాల్లో మునిగి ముత్యాలో, రత్నాలో ఏరుకున్నవారు వందలాది మంది రచయితలు. ముఖ్యంగా పత్రికా రచయితలు, చిత్రకారులు, మేధవులు ఎవరికి వారు తమ మనసుల్లో తామే అనుకున్న మాటలివి. ఆయనలోని విజ్ఞానం లోతుల్ని, అవగాహనలోని నిజాయితీ గాఢత్వాన్ని, ఆలోచనల ఎత్తునీ, సత్యాన్వేషణ దీక్షని స్వయంగా తెలుసుకున్నవారు అభిమాన గౌరవాలతో చెప్పిన మాటలివి'' అంటారు.
రాంభట్ల తాత ముత్తాతలది విశాఖపట్నం జిల్లా. ఆయన రెండో సంవత్సరంలో ఉండగానే తండ్రి చనిపోవడంతో ఓ చోట స్థిరంగా ఉండి విద్యనభ్యసించ లేకపోయారు. అనాతవరం, గజపతినగరం, ఇల్లెందుల్లో చదువుకొని, తిరిగి హైదరాబాదులో అయిదో క్లాసుతో చదువు మానేశారు. చిన్నతనంనుంచీ బొమ్మలు గీయడం నేర్చుకొన్నారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఆయన సొంతంగానే అధ్యయనం చేశారు. గ్రంథాలయాలను నమ్ముకొన్నారు. అందువల్ల అవే ఆయన విశ్వవిద్యాలయాలయ్యాయి. ఆయనకి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అదే ఆయన వరం. అలాగే ఆయనకి గొప్ప తార్కికత, సులభమైన శైలి సహజ సిద్ధంగా అబ్బాయి. అందువల్ల ఏ అంశాన్నయినా పాఠకులు నమ్మేలా చెప్పగలరు. మీ పేరేమిటి అనే వ్యాసంలో రాంభట్ల... తన తార్కికతకి ఎంత బలమైన వాదన జోడించారో చూడండి- చరిత్రను పరిశీలించి చూస్తే శివుడు పాత దేవుడు. అతగానికి పూజలు కూడా విస్తారంగానే ఉన్నాయి. గుళ్ళూ గోపురాలు తక్కువే. ఆయన భక్తులు మాత్రం ఎక్కువ. ఆరాధకులు ఎక్కువ. ఆయన ఆకారం సింపుల్‌. అడిగిన వారికి అడిగినన్ని వరాలూ ఇస్తాడు. అడక్కపోయినా బూడిద ఇస్తాడు. విష్ణువు గొప్ప దేవుడు. ఆయన గుళ్ళూ గోపురాలూ గొప్పగా ఉంటాయి. అడిగిన వారందరికీ అడిగిన వరాలు ఓ పట్టాన కాని ఇవ్వడు. ఇచ్చినా అందులో ఎక్కడో ఓ చిన్న మెలిక ఉంటుంది. ఇప్పుడింక మనుషుల సంగతికొద్దాం. పేదా బిక్కీ అడుగూ బడుగు జనం అంతా శివభక్తులు. వాళ్లు కూడా శివుడు లాగే ఉంటారు. దిగంబరంగానో అర్ధ దిగంబరంగానో బతుకుతారు. కప్పుకొనడానికి బూడిద మాత్రమే వారి దగ్గరుంటుంది. వారిలో నోరున్నవారు అప్పోజిషన్‌గా తయారవుతారు. ఎంత అప్పోజిషన్‌ అయినా కళ్లముందు పవరు కనిపిస్తూ ఉంటుంది. కనక అడక్కపోయినా కోరిన వరాలన్నింటినీ కుమ్మరిస్తూ ఉంటారు. ఇక పవరులోకి వచ్చినవారూ, వారి నాశ్రయించుకుని ఉన్న కింకరులు, అందరూ విష్ణు భక్తులు. వాళ్ళు కూడా విష్ణువు లాగే పీతాంబరాలు, హారకేయూర ధారులు, శేష వస్త్రాలూ శాలువలూ కప్పుకొంటారు. వారి కన్ను పడిన చోట కనక వర్షాలు కురుస్తాయి. వారి పాదాలు సోకిన నేల పరశువేది అవుతుంది. వారంతా పవరులో ఉన్న పొలిటీషన్లు. విష్ణువులాగే ఒక పట్టానా వరాలివ్వరు. ఇచ్చినా అందులో లెక్క లేనన్ని మెలికలుండి తీరుతాయి... ఈ వ్యంగ్యం, సునిశిత హాస్యం, చమత్కారం, పురాణాలపై చరిత్ర పైన ఉన్న పట్టు, అవగాహన ఆయన్ని పత్రికల వైపు ఆకర్షించాయి.
రాంభట్ల కృష్ణమూర్తికి అడివి బాపిరాజుతో పరిచయం ఏర్పడింది. అది ఆయన్ని ''మీజాన్‌'' పత్రికలో ఉప సంపాదకుడిగా చేరేలా ప్రోత్సహించింది. అయితే ఆయన అందులోనే ఉండిపోలేదు. ఆనాటి విషయాల గురించి మల్లిక్‌- ''మనిషి, సమాజ చరిత్ర, కళ, సంస్కృతి, మతం, తాత్వికత- ఇవి ఆయన అభిమాన విషయాలు. ఆదిశంకరుని అద్వైతం తనను మార్క్సిస్టు తాత్వికతను సన్నిహితం చేసిందని ఆయన చెప్పిన మాట చాలా మందికి అర్థం కాలేదు. గోర్కీ లాగానే తనకూ ప్రపంచమూ సమాజమే విశ్వవిద్యాలాలైనాయని ఆయన చెప్పిన మాట చాలా మందికి అవగతం కాదు. చుట్టూ లోకాన్ని, జీవితాన్ని గమనిస్తూ అనుభవిస్తూ ఆయన అధ్యయనం చేశారు. ఆనాటి గొప్ప గ్రంథాలయాలు, ఎందరో మహనీయుల ప్రత్యక్ష పరిచయాలు, ఏక సంథా గ్రాహ్యత ఆయనకు తోడ్పడ్డాయి. జీవిక కోసం శరీర కష్టంతో శ్రమతో కూడిన అనేక పనులు చేశారాయన, ఫౌండరీలలో పని చేశారు. తన పాతికేళ్లప్పుడు 'మీజాన్‌'లో పాత్రికేయుడిగా అడుగు పెట్టిన నాటి నుంచి పత్రికా రచయితగా పెద్ద పెద్ద అంగలతో ముందుకు సాగుతూ పరిణతి చెందారు... 'మీజాన్‌' పత్రిక నుంచి ఆయన ఎందుకు వెళ్ళి పోవలసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ''నిజాం నవాబుని ఉరి తీయాలి'' అని తాను రాసిన సంపాదకీయమే ఆయన నిష్క్రమణకు కారణమైంది. 1952లో ''విశాలాంధ్ర'' పత్రికలో చేరారు. తర్వాత కర్మాగారాలలో పని చేశారు. ఆ తర్వాత 'ఈనాడు' పత్రికలో చేరారు. రాజకీయాలకు - సామాజిక శాస్త్రాల అధ్యయనానికి జీవితాన్ని అంకితం చేశారు. అభ్యుదయ రచయిత సంఘం సారథుల్లో ప్రముఖులు రాంభట్ల. ప్రతి అంశాన్నీ మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేయడం, అన్వయించడం ఆయనకు చాలా సహజంగానే అబ్బింది. ''ఇస్కస్‌'' అనుబంధంతో రష్యా వెళ్లారు. అలాగే అమెరికా, శ్రీలంకలు కూడా సందర్శించారు. ఈనాడులో పదవీ విరమణ చేశాక వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. 'ఉదయం' పత్రికలో కొన్నాళ్ళు రాశారు. ఆయన కావ్యాల్లో తొలిది- ''శశవిశాణం'' కవితల సంపుటి ప్రచురించారు. ''తెలుగు మఋగులు''ను 1986లో ప్రచురించారు. 'తెలుగు పుట్టు పూర్వోత్తరాలు' అనే పెద్ద వ్యాసం ఇందులో ఉంది. సుమేరు, అసీరియా సంస్కృతికి, తెలుగు సంస్కృతికి బాంధవ్యాలను ఆయన అందులో చర్చించారు. 1992లో దాన్ని విస్తృతం చేసి ''తెలుగుదేశంపై సుమేరు సంస్కృతి ప్రభావము'' పేరుతో ప్రచురించారు. అదే సంవత్సరం 'పారుటాకులు' అనే వ్యాస సంకలనం అచ్చయింది. 1997లో 'జనకథ', 1998లో 'వేదభూమి', 2001 మార్చిలో 'సొంతకథ', అదే సంవత్సరం ఆగస్టులో ''వేల్పుల కథ'' ప్రచురితమయ్యాయి. ఆయనకు ''తెలుగు గోష్ఠి'' సంస్థతో చివరి పద్దెనిమిది సంవత్సరాలలో అనుబంధం ఏర్పడింది. ఆయన ఆలోచనలు అసాధారణమైనవి. మేధావులు తప్పక ఆలోచించి, పరిశోధించాల్సిన సారభూతమైన ఆలోచనలు. అందుకే ఆయన్ని ఒరిజినల్‌ థింకర్‌ అనేవారు. మేధావులు, సంస్కృతిపై పరిశోధిస్తున్నవారు ఆలోచించేందుకు అనేక సమస్యలను, ప్రశ్నలను ఆయన ఆ తరం ముందుంచారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, పుస్తకాల రూపంలో వచ్చినవి చాలా స్వల్పమని ఆయన మిత్రులంటారు. రాంభట్ల కృష్ణమూర్తి 2001 డిసెంబరు ఏడో తేదీ కన్ను మూశారు. తెలుగు జాతి, భాష, సంస్కృతి మూలాల కోసం ఆయన సాగించిన అన్వేషణని ఎవరో ఒకరు కొనసాగిస్తారన్న నమ్మకం ఆయనకూ ఉండేది... మనకూ ఉండాలి!